భీమ్‌గల్, ఏప్రిల్ 9: కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి కుమ్మక్కు రాజకీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లోని మదర్సా నూర్మసీదులో మంగళవారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు లో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. తెలంగాణ పెద్దదిక్కు కేసీఆర్‌ను ఓడించడమే కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహు ల్ గాంధీ ప్రధాని మోదీని విమర్శిస్తుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి మోదీని బడేభాయ్ అంటున్నారని, దీన్నిబట్టి ఆ రెండు పార్టీలవి కుమ్మక్కు రాజకీయాలని అర్థమవుతున్నదని చెప్పారు.
ఇప్పటికైనా మైనార్టీ సోదరులు ఆలోచించాలని, ఎంపీ ఎన్నికల్లో మీరు మళ్లీ ఓటు వేస్తే మహారాష్ట్రలో మాదిరిగా ఇక్కడ రేవంత్‌రెడ్డి ఏక్నాథ్ షిండే అవ్వడం ఖాయమని హెచ్చరించారు. నిజామాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతం పేరిట ఓట్లు అడుగుతున్నదని మండిపడ్డారు. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న అర్వింద్.. ఐదేండ్లు గడిచినా బోర్డుకు అతీగతీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏనాడూ ప్రజల మంచిచెడులో పాల్గొనలేదని తెలిపారు. అనంతరం సర్వసమాజ్ కమిటీ పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే వేముల, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి పాల్గొన్నారు.