ఖైరతాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): నాలుగు కోట్ల మంది ప్రజల అస్తిత్వానికి ప్రతిరూపమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మండిపడ్డా రు. రేవంత్‌రెడ్డి రహస్య ఎజెండాతోనే విగ్ర హం రూపురేఖలు మార్చాలని నిర్ణయించిన ట్టు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులతో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా మేధావులు, కవులు, కళాకారుల ఆలోచనలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని గుర్తుచేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి సీఎం పదవిలో కూర్చోగానే తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడని బీసీ కమిషన్ మాజీ సభ్యు డు సీహెచ్ ఉపేందర్ విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చుతుంటే ఎమ్మెల్సీ కోదండరాం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
అస్తిత్వం జోలికొస్తే మరో ఉద్యమం:చిలకమర్రి నర్సింహ
తెలంగాణ తల్లి విగ్రహం భావిబంగారు తెలంగాణకు ప్రతిరూపం అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్, బీఎస్ రాములు లాంటి మేధావులు, కవులు, కళాకారులు విగ్రహానికి రూపకల్పన చేశారని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచివేయాలని చూస్తే ఉద్యమం తప్పదని తేల్చిచెప్పారు.
టీఎస్‌ను టీజీ చేస్తే అభివృద్ధి జరిగిందా?: విద్యాసాగర్
సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులను, హామీలను పక్కన పెట్టారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు విద్యాసాగర్ మండిపడ్డారు. టీఎస్‌ను టీజీ చేస్తే అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు. ఉద్యమకారులు కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు.