హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఇప్పటిదాకా బీసీలను వంచించింది, ముంచిదీ కాంగ్రెస్ పార్టీయేనని, మరోసారి అటువంటి చరిత్ర పునరావృతమైతే బీసీలు ఆ పార్టీని దంచికొడ్తరని ప్రముఖ కవి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ స్పష్టం చేశారు. బీసీ కులగణన సర్వే చరిత్రాత్మకమని పాలకులు చెప్పుకోవడం కాదు, చరిత్రను నిర్మించే ప్రజలు చెప్పుకోవాలని తెలిపారు. బీసీలను నట్టేట ముంచిది కాంగ్రెస్సేనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లు దండుకొని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. దేశంలో మరే రాష్ట్రం కులగణన చేయలేదని, తామే చేశామని చెప్పుకొంటున్న కాంగ్రెస్.. 42 శాతం రిజర్వేషన్లకు పకడ్బందీ చట్టం చేసి స్థానిక సంస్థలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన కులగణన, అసెంబ్లీలో ప్రకటన నేపథ్యంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.
నమస్తే తెలంగాణ: దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా తాము కులగణన చేశామని ప్రభుత్వం చెప్తున్నది. ఆ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసింది. దీనిపై మీ కామెంట్.
జూలూరు: ఒక రకంగా ఇది ఆహ్వానించదగిన పరిణామమే. అయితే, బీసీ కులగణన జరిగిన తీరు, ప్రభుత్వం హడావుడి అంతా చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్‌కు సంబంధించి జరుగుతున్న తతంగమంతా లోతుగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి లేదని అనిపిస్తున్నది. కాంగ్రెస్‌కు, ఆ పార్టీ ప్రభుత్వానికి మొదటి నుంచి బీసీలను వంచించింది. సమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఉన్న అసమానతలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న చరిత్రా ఉన్నది. వర్గాధిపత్యాన్ని పెంచిపోషించిందే కాంగ్రెస్. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరాగా చేశామన్నట్టు చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నంగా కనిపిస్తున్నది.
నమస్తే తెలంగాణ: చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, బీసీ వర్గాలకు న్యాయం చేయడంలో తమ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని సాక్షాత్తు అసెంబ్లీలో సీఎం ప్రకటిస్తే.. మీరేమో బీసీలను ముంచిన చరిత్ర కాంగ్రెస్‌దేనని అంటున్నరు?
జూలూరు: చరిత్రాత్మకమని పాలకులు చెప్పుకోవడం కాదు, చరిత్రను నిర్మించే ప్రజలు చెప్పుకోవాలి. బీసీ కులగణన కోసం క్యాబినెట్ సబ్‌కమిటీ వేసి, ఆ కమిటీకి నివేదిక అందగానే ప్రెస్‌మీట్ పెట్టి, ఆ వెంటనే అసెంబ్లీ సమావేశం పెట్టి, ఏ వివరాలు బయటపెట్టకుం డా దాన్ని చరిత్రాత్మకమంటే ఎవరు నమ్ముత రు? ఈ విషయంలో ప్రభుత్వం అనుసరించి న వైఖరి బీసీ వర్గాలను, బుద్ధిజీవులను తీవ్రం గా కలచివేసింది. ఆందోళనకు గురిచేసింది.
నమస్తే తెలంగాణ: 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలుకాని పక్షంలో తమ పార్టీ నుంచి రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టంగా చెప్పింది. ఇందులో అనుమానించాల్సింది ఏముంది?
జూలూరు: అక్కడే పెద్ద కుట్ర దాగి ఉన్నది. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2023 ఎన్నికల వరకు బీసీ హక్కులపై ఉక్కుపాదం మోపిన చరిత్ర కాం గ్రెస్‌ది. కాంగ్రెస్‌ది బీసీలను నిర్దాక్షణ్యంగా తొక్కిపెట్టిన చరిత్ర. ఇంతచేసినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వైపు ప్రజలు మొగ్గటం వల్లే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసిందే తప్ప, బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని చరిత్ర చెప్తున్నది.
నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలని మీరు కోరుకుంటున్నరు?
జూలూరు: కాంగ్రెస్ చరిత్ర పొడవునా బీసీలను అణచివేసిన చరిత్ర ఉన్నది. ఆ పేరును మార్చుకోవాలంటే కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. లేదంటే బీసీ వర్గాలు ఏకమై ఆ పార్టీని దంచికొడ్తరు. సామాజిక సర్వేలో జరిగిన పొరపాట్లను సవరించుకోవాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపామని చేతులు దులుపుకోకుండా న్యాయస్థానాల్లో నిలబడేలా పకడ్బందీగా చట్టం తేవాలి. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తరు. అందుకోసం సబ్బండ బీసీ వర్గాలు తమతమ కార్యాచరణను ప్రకటిస్తాయి. ఇప్పటికే సంఘాలవారీగా సమరశంఖం పూరించేందుకు పిలుపునిస్తున్నాయి.
నమస్తే తెలంగాణ: బీసీలకు నిజంగా న్యాయం చేయాలనే ఉద్దేశం లేకపోతే కులగణన సర్వే చేసేవారు కాదనే వాదన ఉంది. దీనిపై మీ సమాధానం?
జూలూరు: బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే చేపట్టిన సామాజిక సర్వే అంత అసమగ్రంగా ఉంటుందా? అసెంబ్లీలో అధికారపక్షం మినహా ఏ పక్షమైనా, చివరికి ఎంఐఎం అయినా సర్వేను మెచ్చుకున్నదా? సమగ్ర కుటుంబ సర్వే లెక్కలకు, ఎన్నికల కమిషన్ లెక్కలకు లేదా విద్యాలయాల్లో ఉన్న ఆయా వర్గాల్లో నమోదైన బీసీ లెక్కలకు పొంతన ఉండాలి కదా? అలా లేదు. పైగా బీసీల జనాభా గణనీయంగా తగ్గి.. అగ్రవర్ణ కులాల జనాభా పెరగటం ఏమిటీ? ఇలా తప్పుడు, అసమగ్ర లెక్కలను బయటపెట్టి కాంగ్రెస్ ఎవరిని మోసం చేయాలని చూస్తున్నది? ఎవరికి ద్రోహం చేయాలని చూస్తున్నదో స్పష్టమైపోయింది. సర్వే సమగ్రంగా చేయకుండా బీసీ జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి కాంగ్రెస్ పెద్ద ద్రోహం చేసింది. బీసీల మనసులను గాయపరిచింది. తద్వారా కొండంత ఆశతో ఎదురుచూస్తున్న వర్గాల ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది.