హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఒక మహిళా హాస్టల్లోకి చొరబడి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి అనుచరులు బుధవారం రాత్రి హల్చల్ చేసిన ఘటనపై ఎట్టకేలకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో మహిళా హాస్టల్లో జరిగిన దౌర్జన్యకాండ, రౌడీయిజానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో గురువారం వైరల్ అయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. అమీర్‌పేట జీహెచ్ఎంసీ మార్కెట్రోడ్లో ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ హాస్టల్‌ను డీ వీరహనుమాన్రెడ్డి నిర్వహిస్తున్నాడు. మూడు సంవత్సరాలుగా బాలికల హాస్టల్ నిర్వహిస్తున్న వీరహనుమాన్కు, భవన యజమాని బోయమ్మ వారి కుటుంబసభ్యుల మధ్య వివాదం నడుస్తున్నది. మూడురోజులుగా బొంతు శ్రీదేవి తన అనుచరులతో కలిసి హాస్టల్ వద్దకు వచ్చి అక్కడి సిబ్బందిని, విద్యార్థులను బెదిరిస్తున్నారు. దీనిపై పలుమార్లు డయల్ 100కు ఫిర్యాదు చేసినా వారి వేధింపులు ఆగలేదు. బుధవారం రాత్రి బొంతు శ్రీదేవి, తల్లి బోయమ్మ 30 మంది అనుచరులతో ఒక్కసారిగా హాస్టల్‌పై దాడి చేశారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న వార్డెన్ రాజ్యలక్ష్మి, సూపర్వైజర్ శిరీష, వంట మనిషి భార్య అపర్ణను విచక్షణారహితంగా కొట్టారు.
జుట్టు పట్టుకొని లాగుతూ, చేతులతో కొడుతూ, చివరకు కిందపడేసి కాలితో తన్నారు. దీంతో తీవ్రంగా గాయపడ్డవారిని చుట్టు పక్కల వారు గమనించి 108కి సమాచారం అందించగా, స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. ఈ దాడిని చిత్రీకరించేందుకు ప్రయత్నించిన బాధితుల సెల్ఫోన్లను లాక్కున్నారు. అపర్ణకు చెందిన బంగారు గొలుసును దౌర్జన్యకారులు అపహరించినట్టు చెప్తున్నారు. హాస్టల్‌ను స్వాధీనం చేసుకునేందుకు కొంతకాలంగా బొంతు శ్రీదేవి, ఆమె కుటుంబసభ్యులు వీర హనుమాన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టులో సివిల్ కేసు నడుస్తుండగా, కోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా దాడులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆందోళనకారులు తస్కరించిన సెల్ఫోన్లు, బంగారు గొలుసును రికవరీ చేయాలని వీర హనుమాన్‌రెడ్డి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై బొంతు శ్రీదేవి, ఆమె తల్లి బోయమ్మ, 30 మంది అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా దాడికి సంబంధించి వైరల్ అయిన వీడియోలు గత సంవత్సరానివని బొంతు శ్రీదేవి ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.