Gade Innaiah జఫర్గఢ్, డిసెంబర్ 21 : మావోయిస్టు పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఇన్నయ్య జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తండా గ్రామ పంచాయతీ పరిధిలో ‘మా ఇల్లు ప్రజాదరణ’ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆశ్రమానికి చేరుకుని మూడు గంటలపాటు విచారణ చేపట్టారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు తరలించగా, కోర్టు ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఇన్నయ్య సతీమణి గాదె పుష్ప తెలిపారు. ఇటీవల మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియ సభలో పాల్గొని, నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు మద్దతుగా ప్రసంగించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇన్నయ్యను అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు.
ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం: మాజీ ఎమ్మెల్యే క్రాంతి
హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఖండించారు. ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్న ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు. మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడారని ఎన్ఐఏ అధికారులు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని అన్నారు. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్న ఇన్నయ్యను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి ఇన్నయ్యను విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.