జమ్మికుంట, జూలై 8 : సికాస వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మావోయిస్టు(Former Maoist Hussain) కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్ హుస్సేన్ రియాజ్ అలియాస్ సుధాకర్, రమాకాంత్‌ను సోమవారం తెల్లవారు జామున కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆయన నివాసంలో కరీంనగర్ పోలీసులు అదుపులోకి (Police custody) తీసుకున్నారు. 30 సంవత్సరాలు సుధీర్ఘంగా ఉద్యమంలో పని చేసిన రమాకాంత్ గతంలో జార్ఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ అయి 12 ఏండ్లు జైలు జీవితం అనుభవించారు. అనారోగ్య కారణాలతో బెయిల్‌పై విడుదలైన ఆయన పదేళ్లుగా జమ్మికుంటలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. అరెస్ట్ అయిన ఓ మావోయిస్టుకు సంబంధించిన బెయిల్ కోసం ప్రయత్నించడం.. తదితర అంశాలపై పోలీసులు సోమవారం తెల్లవారుజామున హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మాజీ మావోయిస్టు, రచయిత హుస్సేన్‌ను పోలీసులు జమ్మికుంటలోని ఆయన ఇంటి నుంచి అక్రమంగా పట్టుకెళ్లడాన్ని ఖండిస్తున్నామని, వెంటనే ఆయనను విడుదల చేయాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ర్టాల సమన్వయ కమిటీ సభ్యులు ఎస్ జీవన్‌కుమార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎస్. తిరుపతయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని పాత మార్కెట్ వద్ద తన సొంత ఇంటిలో ఉన్న హుస్సేన్‌ను పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. మఫ్టీలో వచ్చిన వారు పోలీసులమని చెప్పడం తప్ప వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు తీసుకవెళ్తున్నారో కనీస సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు వెంటనే కల్పించుకొని పోలీసుల దౌర్జన్యా న్ని ఆపి మహ్మద్ హుస్సేన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.