హైదరాబాద్, జనవరి2 (నమస్తేతెలంగాణ): ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత సమ యం కావాలని హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని కోరారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా షెడ్యూల్ ప్రకా రం గురువారం రావాలని బీఎల్ఎన్రెడ్డికి ఈడీ డైరెక్టర్ గత నెల 27న నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన తాను ఇప్పటికిప్పు డే రాలేనని, డాక్యుమెంట్ల సమర్పణకు రెం డు, మూడు వారాల గడువు కావాలని ఈడీ డైరెక్టర్‌కు మెయిల్ ద్వారా సమాచారం అం దించారు.
అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న అప్పటి హెచ్ఎండీఏ స్పెషల్ కమిషనర్, పు రపాలక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్ కూడా శుక్రవారం విచారణకు రాలేనని తెలియజేశారు. దీనిపై స్పందించిన ఈడీ అధికారులు వారడిగిన సమయం ఇవ్వలేమని స్పష్టం చేశా రు. ఈ నెల 8న బీఎల్ఎన్రెడ్డి, 9న అర్వింద్‌కుమార్ హాజరుకావాల్సిందేనని చెప్పారు.
హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ నిర్వహణకు 2023 అక్టోబర్‌లో హెచ్ఎండీఏ ద్వారా రూ.55 కోట్లను ఫార్ములా-ఈ రేసు నిర్వాహకులకు చెల్లించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగాయని, మంత్రివర్గ ఆమోదం కూడా లేనందున ఆ చెల్లింపులు చట్టవిరుద్ధమని పేర్కొంటూ 2023 డిసెంబర్ 18న హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
దీంతో ప్రభుత్వం విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు డిసెంబర్ 19న ఈ వ్యవహారంపై కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా అర్వింద్‌కుమార్, ఏ3గా బీఎల్ఎన్రెడ్డిల పేర్లను చేర్చారు. అయితే ఏసీబీ నమోదు చేసిన కేసును ఆధారంగా చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు మొదలు పెట్టింది.