హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సతీసమేతంగా వచ్చారు. ఇటీవల తుంటి ఎముక ఆపరేషన్ అయిన నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి నరసింహన్ దంపతులు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలని నరసింహన్ ఆకాంక్షించారు.
కేసీఆర్, శోభమ్మతో కొద్దిసేపు ముచ్చటించారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. గవర్నర్ హోదాలో నాడు నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారం కూడా మరిచిపోలేమని, ఈ సందర్భంగా నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్న కేసీఆర్.. నరసింహన్‌కు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులను కేసీఆర్ కుటుంబం పట్టువస్త్రాలతో సత్కరించింది.
అంతకుముందు మాజీ గవర్నర్ దంపతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బీబీ పాటిల్, సంతోష్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. కొన్ని రోజులుగా నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆయన యోగక్షేమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు అడిగి తెలుసుకుంటున్నారని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అజ్మీర్ దర్గాకు కేసీఆర్ చాదర్
కేసీఆర్ ఏటా పంపించినట్టే ఈసారి కూడా ఉర్స్ షరీఫ్ సందర్భంగా అజ్మీర్ దర్గాకు చాదర్ పంపించారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆజమ్ అలీ తదితర ముస్లిం పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.