వర్గల్, జూలై 31: కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేసిందని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. పరిహారం కోసం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లి రైతులు గురువారం నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా వంటేరు ఆందోళనలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ హయాంలో టీఎస్ఐఐసీలో భాగంగా పరిశ్రమల స్థాపన కోసం అవుసులోనిపల్లిలో భూసేకరణ చేపట్టినట్టు తెలిపారు. అప్పట్లో భూనిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎకరాకు రూ.10 లక్షల నగదు ఇవ్వడంతోపాటు ఇంటిస్థలం కేటాయించిందని అన్నారు.
ప్రభుత్వం మారడంతో మరికొందరు రైతులకు నష్టపరిహారం, ఇంటిస్థలాల కేటాయింపు ప్రక్రియ నిలిచి పోయిందని చెప్పారు. ఎన్నికల ముందు అవుసులోనిపల్లి రైతులతో టెంట్లు వేయించి ధర్నా చేయించిన కాంగ్రెస్ నాయకులు, వారి ప్రభుత్వం రాగానే మాట మార్చడమేమిటని ప్రశ్నించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు ఇంటిస్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. పరిహారం అందని భూనిర్వాసితులు వారి భూముల్లో వరినాట్లు వేశాక ఇప్పుడు పొలాలకు కరెంట్ బంద్ చేయడం రైతులను మానసిక క్షోభకు గురిచేయడమేనని ఆయన విమర్శించారు.
నష్టపరిహారం డబ్బులు రాక కొంతమంది, ఇంటిస్థలాలు రాక వందమంది రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఉన్నపలంగా కరెంట్ సరఫరా బంద్ చేసి వరిపొలాలను ఎండబెట్టే కుట్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానకాలం పంట పూర్తికానిదే కరెంట్ బంద్చేస్తే రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.