(కుకునూరుపల్లి), మార్చి 5 : నీళ్లులేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్, హరీశ్‌రావుపై కక్ష గట్టి రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాను ఏడారిగా మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని దమ్మక్కపల్లిలో ఎండిపోయిన పంటలతోపాటు నీళ్లు లేని కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ పాలనలో పచ్చని పొలాలు, గోదావరి జలాలతో చెరువులు, కుంటలు, కాలువలు నిండుకుండలా ఉండేవని అన్నారు. నేడు కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఎడారిని తలపిస్తున్నదని ఆరోపించారు. రైతుల బాధలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు.
సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతుంటే, కాంగ్రెస్ నాయకులు, సీఎం రేవంత్‌కు చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించాడు. రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో కాలువకు ఇరువైపులా ఏటా రెండు పంటలకు నీళ్లందాయని, 6వేల ఎకరాల్లో పంట పండేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా కొండపాకకు చుక్క నీరు రాలేదని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపకపోవడంతో భూగర్బ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోయాయని మండిపడ్డారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లను ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు ఇవ్వకుండా.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లాకు తరలించుకుపోతున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీళ్లు అందించడానికి టన్నెలు పనులు ప్రారంభిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయని తెలిపారు.