కేసీఆర్ అంటే ఉద్యమం. కేసీఆర్ అంటే విజయం. తెలంగాణ సాధకుడు, ప్రగతిప్రబోధకుడు. పాలిస్తున్నది కాంగ్రెస్ అయినా ప్రజల గుండెల్లో నిలిచింది కేసీఆర్. ఆయన పదేండ్లపాలన విజయగాథలే ఇప్పటికీ విశ్వవీధుల్లో రెపరెపలాడుతున్నాయి. అందుకే వారికి కేసీఆర్ అంటే అక్కసు. ఆనవాళ్లు చెరిపేయాలనే ఉరుకులాట. కుళ్లి కంపు కొడుతున్న అక్ర మార్కుల పాలనను అడుగడుగునా ప్రజల పక్షాన నిలదీస్తున్నది కేసీఆర్. నిద్ర లేకుండా చేస్తున్నది కేసీఆర్. తెలంగాణను ఆగం చేసే ఎత్తుగడలను ఎండగడుతున్నది కేసీఆర్. హక్కులను తాకట్టు పెడుతున్న ఇంటి దొంగలను కడిగేస్తున్నది కేసీఆర్. వారు ఎన్నడూ అందుకోలేని శిఖరం కేసీఆర్. తోసిరాజనలేని నికర సత్యం కేసీఆర్. చేతగాని, చేవలేని పాలనను నడిబజార్లో నిలబెడుతున్నది కేసీఆర్.
మాయదారి ఎత్తులతో, మోసకారి జిత్తులతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు చేసిందేమీ లేదు. చెప్పుకొనేందుకు అసలే లేదు. అడుగడుగునా కేసీఆర్ విజయాలు వారిని పరిహసిస్తున్నాయి. అందుకే కేసీఆర్ అంటే వారికి కక్ష. కార్పణ్యం. పగలు, సెగలతో రగిలిపోతున్న కాంగ్రెస్ పాలకులకు కేసీఆర్ అనే మూడక్షరాలు ఓ టార్గెట్. చెల్లని కేసులు, డొల్ల నోటీసులతో కొండపైకి బండను ఎక్కించాలని ఆపసోపాలు పడుతున్నారు. ఆకాశంపైకి ఉమ్మేసే వికృత సాహసానికి ఒడిగడుతున్నారు. నిజస్వరూపాన్ని చూపే నిలువుటద్దం మీద రాళ్లు వేయాలని చూస్తున్నారు. ఎవరెన్ని చేసినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగేది లేదు. కేసీఆర్ ముద్ర చెరిగేది కాదు.
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు అక్రమ పద్ధతిలో తనకు నోటీసులిచ్చి.. సాక్షిగా విచారించేందుకు పట్టుబట్టి మరీ ఉవ్విళ్లూరుతున్న స్పెషల్ సిట్‌కు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆహ్వానం పలికారు. నేడు బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో తనను విచారించుకోవచ్చని శనివారం అంగీకారం తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణాధికారి పీ వెంకటగిరికి లిఖితపూర్వకంగా సమాధానం పంపారు. తెలంగాణ సాధకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, పోరాడి సాధించుకున్న రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా తనకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన గౌరవాన్ని పోలీసులు విస్మరించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
చట్టపరిధిలోని అంశాలను పాటించకుండా దురుద్దేశంతో ఇచ్చే నోటీసులకు తాను హాజరుకావాల్సిన అవసరం లేదని ఉటంకించారు. తనకు నోటీసు ఇచ్చే అధికారం సిట్ అధికారులకు లేదని చెప్పారు. అక్రమ పద్ధతిలో, చట్టాలను అతిక్రమించి ఇచ్చిన నోటీసులతో తనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడమేనని అభిప్రాయపడ్డారు. నోటీసులు ఇవ్వడంలో సిట్ అధికారులు పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను, విపరీత ధోరణిని ఎండగట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా,మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా సిట్ దర్యాప్తునకు సహకరించాలనినిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. నందినగర్ నివాసంలోనే కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ పట్టుబట్టినందున అకడే అందుబాటులో ఉంటానని అంగీకారం తెలిపారు. దీంతో నేడు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లో సిట్ అధికారుల విచారణ ఉండనున్నది.
తెలంగాణ సాధకుడిగా, తెలంగాణ అంతా జననేతగా పిలుచుకునే కేసీఆర్‌కు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వడంతో స్పెషల్ సిట్ అత్యుత్సాహం ప్రదర్శించింది. రాష్ర్టానికి పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అని తెలిసి కూడా అక్రమంగా పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ను సాక్షిగానే విచారిస్తున్నారనే విజ్ఞత మర్చిపోయి ప్రవర్తించింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ కేసీఆర్ లేని ఇంటికి నోటీసులు అంటించి వెళ్లడం ఆక్షేపనీయమని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 65 ఏండ్లు పైబడిన వ్యక్తులను వారు నివసించే చోటనే విచారించాలని చెప్పే సెక్షన్ 160 సీపీఆర్పీసీ నిబంధనలను కూడా సిట్ తుంగలో తొక్కుతూ తమకు అనుకూలంగా ప్రత్యుత్తరమిచ్చిందని మండిపడుతున్నారు.
ఎలక్షన్ అఫిడవిట్ అంటూ నోటీసుల్లో పేర్కొన్న సిట్ అధికారులు.. అదే పద్ధతిని హరీశ్‌రావు విషయంలో ఎందుకు పాటించలేదని నిలదీస్తున్నారు. హరీశ్‌రావు అఫిడవిట్లో సిద్దిపేట చిరునామా ఉన్నా హైదరాబాద్‌లో నోటీసు ఇచ్చారని, ఇది సిట్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని తేల్చి చెప్తున్నారు. దీంతో పాటు ఇచ్చే నోటీసుల్లో కూడా కేవలం గజ్వేల్ ఎమ్మెల్యే అని రాయడం, కేసీఆర్ మాజీ సీఎం అని ప్రస్తావించకపోవడం కూడా సిట్ విపరీత ధోరణికి అద్ధం పడుతున్నదని ఫైర్ అవుతున్నారు. సిట్ అధికారుల తీరు ఇలా ఉంటే.. వారి విచారణలో రాజకీయ దురుద్దేశం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు.
కేసీఆర్‌ను ఎలాగైనా నందినగర్ రప్పించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సిట్ అధికారులు.. ఆ మేరకు బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేసీఆర్‌కు మొదటిసారి నోటీసులిచ్చే ముందే పలు దఫాలుగా బందోబస్తు ఏర్పాట్లపై రహస్యంగా చర్చలు జరిపారు. అనంతరం ఇచ్చిన నోటీసుల తర్వాత మరోసారి చర్చించిన సిట్ అధికారులు వేలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ సానుభూతిపరులు వచ్చే అవకాశం ఉన్నదని అంచనా వేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పరిధిలోని పోలీస్ ఫోర్స్‌తోపాటు, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పించారు. ఆదివారం తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని, వేలాదిగా కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలిరావాలని పిలుపునివ్వడంతో బెటాలియన్స్‌ను కూడా రంగంలోకి దించుతున్నారు.
విచారణకు కేసీఆర్ సిట్‌ను ఆహ్వానించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అన్ని చోట్లా పాక్షికంగా.. బంజారాహిల్స్ మొత్తం పోలీస్ ఫోర్స్‌తో నింపనున్నారు. తెలంగాణ భవన్, నందినగర్, కేబీఆర్ పార్క్, ఖైరతాబాద్, సిటీ సెంటర్, మెహిదీపట్నం, నాంపల్లి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వంటి ప్రాంతాల్లో భారీగా పోలీసులతో మోహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నందినగర్‌లో ఐదంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. విచారణకు ఆటంకం ఏర్పడకుండా తెలంగాణ భవన్, బంజారాహిల్స్, నందినగర్ వైపు వెళ్లే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టనున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ తరలివచ్చే బీఆర్ఎస్ నేతలను ముందస్తుగానే అరెస్టు చేసే అవకాశాలున్నాయి. కొందరు బీఆర్ఎస్ కీలక నేతల ఇండ్ల వద్ద పోలీస్ బలగాలను బందోబస్తుకు దించుతున్నారు. ఈ మేరకు బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ శివధర్‌రెడ్డి, లా అండ్ ఆర్డర్ మహేశ్ భగవత్, సిటీ కమిషనర్ సజ్జనార్ రహస్యంగా సమీక్షించారు. రాజకీయ దురుద్దేశంతో కొనసాగుతున్న ఈ విచారణకు వారికి అనుకూలమైన ప్రశ్నావళితో స్పెషల్ సిట్ అధికారులు సిద్ధమయ్యారు.