హైదరాబాద్, మార్చి11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌లో కూర్చొని మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ హెచ్చరించారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్‌కు హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఎక్కడిదని ప్రశ్నించారు. ఒబెదుల్లా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీతో కుమ్మైక్కె పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్‌రెడ్డిని ఓడించారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతున్నదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కరీంనగర్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌కు అడ్రస్ లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒబెదుల్లా ముస్లింలకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే షాదీముబారక్ కింద రూ.లక్షతోపాటు ఇస్తామన్న తులం బంగారం, మైనార్టీల సబ్‌ప్లాన్ గురించి ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని హితవు పలికారు.