హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి, వారి గొంతుకోసిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇప్పుడెందుకు మౌనంగా ఉండిపోయారని మంగళవారం తన ఎక్స్ ఖాతా ద్వారా నిలదీశారు. జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలపడం కనిపించడం లేదా..? అని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి, మంత్రులందరూ నోరు తెరిస్తే.. పచ్చి అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.