JD Lakshminarayana | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఇరికించాలని చూస్తే కేసు నిలువదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం తన అధికారిక పరిధిలోనే ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కేటీఆర్ ఆధారాలను విచారణలో ఏసీబీకి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజాధనం ఎక్కడా దుర్వినియోగం కాలేదని తేలితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు కూడా నిలువదని చెప్పారు. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు ఆధారంగా ఈడీ కేసు ఉంటుందని వివరించారు. ఈ కేసు విచారణకు నిలుస్తుందా? నిలువదా అనేది ఇప్పుడే చెప్పలేమని, విదేశీ మారకం నిబంధనలు ఏమిటి? ఆధారాలు ఏమిటి? వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫార్మూలా ఈ-కార్ రేసు వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయనే ఆరోపణలపై ఏసీబీ కేటీఆర్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గవర్నర్ అనుమతి, కేసు విచారణ, ఆర్బీఐ నోటీసు వంటి అనేక అంశాలను వివరించారు.
2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్‌కు ఒక సవరణ తెచ్చారు. 2018 కంటే ముందు అవినీతి ఆరోపణలు వస్తే చాలు వెంటనే ఏసీబీ, సీబీఐ జోక్యం చేసుకొని విచారణ జరిపేది. 2018 సవరణ తర్వాత ఏ వ్యక్తిపై అయితే ఆరోపణ వచ్చిందో ఆ వ్యక్తికి సంబంధించిన హెచ్‌వోడీ అనుమతిని ఏబీసీ తీసుకోవాల్సి ఉంటుంది. నేరుగా డబ్బులు తీసుకుంటూ చిక్కితే మాత్రం ఎవరి అనుమతీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ-కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ ఎమ్మెల్యే. డబ్బులు చేతులు మారలేదు. కేవలం ఆరోపణలు వచ్చినందున విచారించడానికి ముందుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాతే కేటీఆర్, ఐఏఎస్ అధికారి ఆర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం నాలుగేండ్లకు ఒప్పందం చేసుకొని నాటి ప్రభుత్వం ఈ-కార్ రేసింగ్ నిర్వహించింది. ఈ రేస్ కోసం మిగతా నగరాలు కూడా పోటీ పడినా వాటిని తలదన్ని ఫిబ్రవరి 2023లో బ్రహ్మాండంగా జరిపారు. హైదరాబాద్‌కు రూ.700 కోట్ల ప్రయోజనం చేకూరినట్టు నెల్సన్ సంస్థ నివేదిక వెల్లడించింది. తర్వాత ఎన్నికలు వచ్చాయి. తనకు నష్టం వచ్చిందని గ్రీన్ కో సంస్థ స్పాన్సర్షిప్ నుంచి తప్పుకున్నది. నాటి ప్రభుత్వం రేస్ రద్దవుతుందని రూ.55 కోట్లు నిర్వహణ సంస్థకు చెల్లించింది. ఒకవేళ ఒప్పందం రద్దు చేసుకుంటే మాంట్రియల్ దేశం తరహాలో మనం జరిమానా చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వం భావించింది. మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో తర్వాత స్పాన్సర్‌ను వెతుక్కుందామని అనుకున్నది. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు. సాధారణంగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉంటాయి. నాలుగు రేసుల కోసం ఒప్పందం జరిగితే ఇక్కడ దాన్ని కొనసాగించలేదని తెలుస్తున్నది.
విదేశీ సంస్థలకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రూపాయలను విదేశీ మారకంలోకి మార్చడం కోసం నిబంధనలు పాటించకపోవడంతో రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకొని నోటీసులు ఇచ్చినట్టు, రూ.8 కోట్లు డ్యామెజీ కింద చెల్లించినట్టు పేపర్లో చదివా.
ప్రధాన ఆరోపణ ఏమిటంటే నమ్మకంతో మీ దగ్గర డబ్బులు పెడితే నియమావళి పాటించకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా, రిజర్వు బ్యాంకు పర్మిషన్ తీసుకోకుండా రూ.55 కోట్లు ఓ సంస్థకు చెల్లించారనేది! హెచ్ఎండీఏ చైర్మన్‌గా సీఎం, వైస్ చైర్మన్‌గా ఎంఏయూడీ మినిస్టర్ కేటీఆర్, మెంబర్ కన్వీనర్‌గా అర్వింద్‌కుమార్ ఉన్నారు. ఇందుకు క్యాబినెట్ అనుమతి అవసరం లేదని, వైస్ చైర్మన్‌గా నిర్ణయం తీసుకొనే అధికారం తనకు ఉన్నదని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇది కరెక్టే. అయితే, కేటీఆర్ తన దగ్గర ఉన్న ఆధారాలను ఏసీబీకి ఇవ్వాల్సి ఉంటుంది. తనకు ఉన్న అధికార నిబంధనల మేరకు వ్యవహరించాను కాబట్టి కేసు క్లోజ్ చేయాలని కేటీఆర్ చెప్పాల్సి ఉంటుంది.
ఏడేండ్లకంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో సీఆర్పీసీ నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. కానీ, 409 సెక్షన్ కూడా జోడించారు కాబట్టి పదేండ్ల జైలు/ జీవితఖైదుకు అకాశం ఉన్నది. నోటీసులు ఇవ్వకుండా కూడా ఏసీబీ విచారణ జరుపవచ్చు. ఏసీబీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. చట్టంలో ఉన్న అనేక ప్రొవిజన్స్‌ను వారు వాడుకొనే అవకాశం ఉంటుంది.
ఏసీబీ అధికారులు విచారణ జరిపి కేటీఆర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరిస్తే కేసు నిలబడుతుంది అనుకొంటే చార్జిషీట్ వేస్తారు. ఒకవేళ ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లభించని పక్షంలో కేసుకు వెళ్లరు. ఆధారాలు లభించి చార్జిషీట్ దాఖలు చేస్తే కోర్టులో ట్రయల్స్ జరుగుతాయి. చివరికి శిక్షలు వేసిది కోర్టులు కాబట్టి తుది తీర్పును బట్టి శిక్ష అమలవుతుంది.
పబ్లిక్ సర్వెంట్ హోదాలో ప్రభుత్వ ఆస్తిని ఆధిపత్యం కలిగి ఉండి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడినట్టుగా ఐపీఐ 409 సెక్షన్ జోడించారు. చాలా తీవ్రమైనది. ఈ సెక్షన్ ప్రకారం 10 ఏండ్ల జైలు లేదా జీవిత ఖైదు ఉంటుంది. అయితే, 13(1)ఏ సెక్షన్ కూడా పెట్టారు. ఇది ఏడేండ్లలోపే శిక్షకు సంబంధించిన సెక్షన్.
దేశంలో ఎక్కడైనా ఏసీబీ, సీబీఐ కేసుగానీ నమోదైదే ఈడీకి ఫిర్యాదు వెళ్తుంది. ఇక్కడ మనీలాండరింగ్ జరిగిందా? నల్లడబ్బును తెల్ల డబ్బుగా మార్చడం జరిగిందా? అనేది ఈడీ తేల్చుతుంది. ఈడీ అధికారులు ఎఫ్ఐఆర్ తరహాలో ఈసీఐఆర్ నమోదు చేస్తారు. ఏసీబీ, సీబీఐ కేసు ఆధారంగా ఈడీ కేసు ఉంటుంది. రూ.55 కోట్లు ఏమైనా పక్కదారి పట్టాయా? లేదా అనేది ఈడీ నిర్ధారిస్తుంది.
విచారణ సక్రమంగా జరగకపోతే హైకోర్టుకు వెళ్లవచ్చు. అక్కడ ఫిర్యాదు చేసి న్యాయం కోరవచ్చు. ఏమీ లేకుండా ప్రతిపక్షాలు ఇరికించాలని చూస్తే న్యాయస్థానాల్లోనూ, ప్రజల ముందు ప్రభుత్వం పలుచనవుతుంది.
ఈ కేసు విచారణకు నిలుస్తుందా? నిలువదా అనేది మనం తేల్చలేం. ఆధారాలను బట్టి కేసు విచారణ జరుగుతుంది. నిబంధనలు ఏమిటి? ఆధారాలు ఏమిటి? విదేశీ మారకం నిబంధనలు ఏం చెప్తున్నాయి? వంటి అనేక అంశాలుంటాయి. కేసుకు కావాల్సింది ఆధారాలు. ఇరు పక్షాలు సమర్పించే ఆధారాలను బట్టి కేసు కొనసాగుతుంది. ఏ కేసుకు ఆ కేసు ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో కక్షసాధింపు అనే ప్రస్తావన అనవసరం. సాధారణంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న ఏ కేసు విచారణ జరిగినా కక్షసాధింపు చర్యలు అంటుంటారు.