లింగాల, అక్టోబర్ 25 : అప్పుల బాధ తాళలేక దిగాలు చెంది చివరకు గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. లింగాల మండలం కొత్తకుంటపల్లికి చెందిన సౌడమోని పర్వతాలు (48) 2019 ఫిబ్రవరి ఒకటిన బీఆర్ఎస్ నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. రెండేండ్లపాటు అభివృద్ధి పనులు చేశాక.. కాంగ్రెస్ హయాంలో బిల్లులు రాలేదు.
దీంతో రూ.30 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు పెరుగుతుండటంతో నాలుగెకరాల వ్యవసాయ భూమిని అమ్మినా తీరలేదు. నిత్యం అప్పు ఇచ్చినవారు ఇంటికొచ్చి అడుగుతుండటంతో మనస్తాపంతో నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి శనివారం ఇంటికొచ్చి నిద్రపోతుండగా.. గుండెపోటు వచ్చింది. గమనించిన కుటుంబీకులు 108 అంబులెన్స్‌లో అచ్చంపేట దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.