కొత్తగూడెం అర్బన్, ఆగస్టు 15: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకొని పినపాక, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నీళ్లను పినపాక, ఇల్లెందు నియోజకవర్గాలకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లా మంత్రులు వారి నియోజకవర్గాలకు తరలించుకు వెళ్తుండటాన్ని నిరసిస్తూ రేగా కాంతారావు, హరిప్రియ గురువారం ఆందోళనకు పిలుపునిచ్చారు.
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సీతారామ ప్రాజెక్టు రెండో పంపుహౌస్ ప్రారంభోత్సవాన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటారనే ఆలోచనతో భద్రాద్రి జిల్లా పోలీసులు గురువారం వీరిని ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రేగా కాంతారావు.. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు.
అనంతరం పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న రేగా కాంతారావు, హరిప్రియ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ డీఎస్పీ రెహమాన్‌ను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు లేదా అంటూ నిలదీశారు. అయినప్పటికీ వారి మాటలను పోలీసులు పట్టించుకోకుండా బలవంతంగా అరెస్టు చేశారు.
హరిప్రియను మహిళా పోలీసులు ముందుకు నెట్టేసి మరీ పోలీసు వాహనంలోకి ఎక్కించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకుల అరెస్టుకు నిరసనగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల వాహనాలకు అడ్డుగా నిలబడి ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో పార్టీ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొన్నది.
కార్యకర్తలను పోలీసులు నెట్టేసి మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ నేతలను కొత్తగూడెం వన్‌టౌన్, సుజాతనగర్ పోలీసుస్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేందర్, చుంచుపల్లి మాజీ ఎంపీపీ శాంతి, నాయకులు రాజశేఖర్, భాస్కర్‌రావు, అనుదీప్, తపస్వి, గిరిబాబు, సత్యనారాయణ, కృష్ణ, లక్ష్మణ్, రమణ, నరసింహారావు, రామారావు, రవి ఉన్నారు.

ఇల్లెందులో న్యూడెమోక్రసీ నేతల అరెస్టు
ఇల్లెందు రూరల్ : సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఇల్లెందు ఏజెన్సీకి ఇవ్వకుండా మైదాన ప్రాంతాలకు తరలించుకుపోతుండటాన్ని నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు భద్రాద్రి జిల్లా ఇల్లెందులో గురువారం ఆందోళన చేపట్టారు. పోలీసులు.. నిరసనకారులను అరెస్టు చేశారు. ఎన్డీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అవునూరి మధు సహా ఆ పార్టీ నేతలు తుపాకుల నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.