హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి నాలుగుకోట్ల ప్రజల గొంతుక అయిన ‘నమస్తే తెలంగాణ’పై కేసులు అప్రజాస్వామికమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర ఖండించారు. నాదర్గుల్లో బిగ్ బ్రదర్స్ ల్యాండ్ పూలింగ్పై ఆధారాలతో ప్రచురించిన పత్రిక గొంతునొక్కడం దుర్మార్గమని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను హరించడం, ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల హక్కులను కాలరాయడమే ప్రజాపాలనా? అని నిలదీశారు. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆరోపించారు. ఎంత తొక్కితే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.