హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేశంలో అన్నిరంగాల్లో పరివర్తన వస్తేనే గుణాత్మక మార్పు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్చేసి.. రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ వర్ణాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదంతోనే ‘భారతదేశ పరివర్తన’ సాధ్యమని స్పష్టంచేశారు.
మహారాష్ట్రకు చెందిన ‘ఫౌజీ జనతా పార్టీ’ కార్యదర్శి, ప్రజాదరణ కలిగిన మాజీ సైనికుడు సునీల్ బాపురావు పగారే నేతృత్వంలో భారీ సంఖ్యలో మాజీ సైనికులు సీఎం కేసీఆర్ సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. కిసాన్తో కలిసి దేశంలో మార్పుకోసం జవాన్లుగా పోరాడుతామని ప్రతిన బూనారు. సీఎం కేసీఆర్ మాజీ సైనికులకు బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబ్ కీ బార్ కిసాన్ సరార్ నినాదాన్ని అందుకొని రైతురాజ్య స్థాపన కోసం జవాన్లు ముందుకు రావడం గొప్ప పరిణామమని అన్నారు. ఇది దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు సూచన అని పేరొన్నారు.

Cmkcr1
నాడు రక్షణ కోసం.. నేడు మార్పుకోసం
గతంలో దేశ రక్షణకోసం పోరాడిన మాజీ సైనికులు.. ఇకపై దేశంలో మార్పుకోసం పోరాటం మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా అమలు చేస్తే గుణాత్మక మార్పు సాధ్యమేనని తెలిపారు. బీఆర్ఎస్లో చేరినవారిలో సాధారణ మాజీ సైనికులతోపాటు సైన్యంలో పెద్దపెద్ద ర్యాంకుల్లో పనిచేసినవారు కూడా ఉన్నారు. కర్నల్, లెఫ్టినెంట్ స్థాయిలో పనిచేసినవారు అధికారులు కూడా పార్టీలో చేరారు.
మాలేగావ్‌కు చెందిన ప్రవీణ్ ఆనంద్ థోకే, నాసిక్వాసి సాగర్ మాగ్రే, పుణె నుంచి తుకారాం దఫద్, సోలాపూర్ నుంచి సునిల్ ఆంధారే, శిరూర్ నుంచి బబన్ పవార్, డోండ్వాసి సందీప్ లగడ్, బీడ్ నుంచి రాజేంద్ర కప్రే, ధారాశివ్ నుంచి హరిదాస్ షిండే, సంగ్లికి చెందిన శివాజీ నాయక్, జల్నా నుంచి దినకర్ ధోడే, వాషిమ్ నుంచి అముల్ మపరీ, సూరజ్ నామ్‌దేవ్ రౌత్, అజింకియా రౌత్, నందకుమార్ కడ్సే, అకోలావాసి మహేశ్ హాన్, అహ్మద్‌నగర్ నుంచి ఉమేశ్ హండే, హడప్సర్ నుంచి నారాయణ్ తోపే, నాగ్నాథ్ గోర్పడే, సంగ్లీకి చెందిన రమేశ్ సాహెబ్, దోండ్ నుంచి జైనక్ సాహెబ్ తదితర మాజీ సైనికులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాలసుమన్, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న దోండ్గే, కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.