మారేడ్పల్లి, మే 31: హైదరాబాద్ మాజీ ఆర్చ్ బిషప్ తుమ్మబాల(80) ఈ నెల 30న అనారోగ్యంతో కన్నుమూశారు. వరంగల్ బిషప్గా 25 ఏండ్లపాటు పనిచేసిన తుమ్మబాల అంత్యక్రియలు శుక్రవారం సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ బసలికా చర్చిలో నిర్వహించారు. ముందుగా, ఆయన పార్థివదేహాన్ని వరంగల్ నుంచి సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లోని సెయింట్ మేరీస్ స్కూల్కు తీసుకొచ్చి, అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ పలువురు ప్రముఖులు, క్రైస్తవులు ఆయన పార్థివదేహంపై పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఆధ్మాత్మిక సేవలో అత్యున్నతస్థాయికి ఎదిగారు : కేసీఆర్
హైదరాబాద్ అర్చ్ బిషప్, మోస్ట్ రివరెండ్ తుమ్మబాల మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. వరంగల్ వాసి అయిన తుమ్మబాల.. క్రీస్తు సేవకోసం తన జీవితాన్ని అర్పించి, తాను విశ్వసించిన ఆధ్యాత్మిక సేవలో అత్యున్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న పరిచయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తుమ్మబాల మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు.
క్రైస్తవ సమాజానికి తీరని లోటు: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ మాజీ ఆర్చ్ బిషప్ తుమ్మ బాల మృతి క్రైస్తవ సమాజానికి, అభిమానులకు తీరని లోటు అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో తుమ్మబాల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని తెలిపారు.