హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. లాయర్‌గా జీవితాన్ని ప్రారంభించిన బొజ్జల, ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994-2004ల మధ్య చంద్రబాబు క్యాబినెట్లో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయకుండా.. తన రాజకీయ వారసుడిగా కుమారుడు సుధీర్‌రెడ్డిని బరిలో దింపగా ఓటమి చెందారు. అలిపిరి ఘటనలో చంద్రబాబుతోపాటు బొజ్జల కూడా గాయపడ్డారు. తీవ్ర అనారోగ్యంతో మూడు నెలలు దవాఖానలోనే ఉన్న బొజ్జల ఇటీవలే కొంత కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తిరిగి ఆయనను కుటుంబసభ్యులు అపోలో దవాఖానలో చేర్చి చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోయింది.
సీఎం కేసీఆర్ సంతాపం
బొజ్జల మృతిపట్ల సీఎం కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో తనతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ సహచరుడిని, ఆత్మీయ మిత్రుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జలను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన జ్ఞాపకాలను కేసీఆర్ స్మరించుకున్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు సానుభూతి తెలిపారు. బొజ్జల మరణవార్త తెలుసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. బొజ్జల కుటుంబ సభ్యులను ఓదార్చారు.