హైదరాబాద్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణ కోసం పాలక కమిటీలు ఏర్పాటు చేసి చెరువుల్లో పూడిక తీయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సిఫార్సు చేసింది. అందుకు సంబంధించిన నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి శుక్రవారం అందజేశారు. కమిషన్, సాగునీటి శాఖ, వ్యవసాయశాఖ అధికారులు వాలంతరి ప్రతినిధులు, నిపుణులతో పలుసార్లు సమావేశాలు నిర్వహించింది. చెరువుల పరిరక్షణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపు తదితర అంశాలపై వివరంగా చర్చించింది. ఆయా అంశాలను క్రోడీకరించి నివేదికను రూపొందించింది. తాజాగా పలు సిఫార్సులు చేస్తూ ఉత్తమ్‌కు నివేదికను అందజేసింది.
ప్రభుత్వానికి చేరిన ఎన్జీఆర్ఐ నివేదిక ; మంత్రి ఉత్తమ్‌కు అందజేసిన సంస్థ ప్రతినిధులు
హైదరాబాద్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సర్వే నివేదికను ఎన్జీఆర్ఐ (నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఎట్టకేలకు ప్రభుత్వానికి అందజేసింది. సంస్థ ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి రిపోర్టు అందజేసి, సర్వే రిపోర్టులోని అంశాలపై చర్చించారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన, ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసేందుకు ఎన్జీఆర్ఐ నేతృత్వంలో హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే నిర్వహించింది. భూమికి అడుగున వెయ్యి మీటర్ల లోతు వరకు ఉన్న జియోలాజికల్ కండీషన్ డాటా సేకరించి, సర్వే రిపోర్ట్‌ను మాత్రం ఇరిగేషన్‌శాఖకు అందించలేదు. రిపోర్టు అందకుండానే ప్రభుత్వం సొరంగం పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఈ విషయమై ఇటీవల ‘ఎన్జీఆర్ఐ రిపోర్టు ఎక్కడ?’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో ఎన్జీఆర్ఐ ప్రతినిధులు నివేదిక అందించడం గమనార్హం.