Telangana | ప్రాచీన కవుల అక్షర సేద్యానికి సాహిత్యమే అసలు సాక్ష్యం. అది భావి తరాలకు చేరాలి. అస్తిత్వం అర్థం కావాలి. కానీ సమైక్య పాలనలో అది జరగలే. స్వరాష్ట్రం సిద్ధించాక ఆ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం భుజాన వేసుకున్నది. తెలుగు కవులకు గౌరవమిచ్చి స్మరించుకుంటున్నది. తాళప్రతులపై రాసిన సాహిత్యాన్ని డిజిటలైజేషన్ చేస్తున్నది. నేటి యువతలో దాగి ఉన్న సాహిత్యాన్ని తట్టి లేపేందుకు పాటు పడుతున్నది. సాహిత్య బాటకు కొత్త దారులేస్తున్నది.
తెలుగు సాహిత్యంలో ప్రత్యేకతను చాటుకున్న కవులను స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. బమ్మెర పోతన, తెలుగులోనే తొలి కవిగా ప్రసిద్ధి పొందిన పాల్కురికి సోమనాథుడు నివసించిన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నది. చారిత్రక వైభవాన్ని తెలియజేసేలా గొప్ప నిర్మాణాలు జరుగుతున్నాయి.
రూ.60 కోట్లతో అభివృద్ధి..
జనగామ జిల్లాలోని పలు ప్రాంతాలను దాదాపు రూ.60 కోట్లతో ప్రభుత్వం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నది. 2017, ఏప్రిల్ 28న బమ్మెరలో పోతన స్మృతి వనం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ప్రారంభించగా పనులన్నీ పూర్తయ్యాయి. బమ్మెరలో పోతన మ్యూజియం, థియేటర్, స్మృతివనం, పోతన సమాధి, ఆయన పొలం వద్ద బావితో పాటు కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగుతున్నది. పాలకుర్తిలో సోమనాథుని మందిరం, స్మారక విగ్రహం, స్మృతి మందిరం, లైబ్రరీ, కల్యాణ మండపం, గార్డెనింగ్‌తో పాటు ప్రధాన రోడ్లకు అనుసంధానంగా కొత్త రోడ్లను నిర్మించారు. పాలకుర్తిలో సోమనాథుడి (12 అడుగులు), బమ్మెరలో పోతన (22 అడుగులు) విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తాళ్రప్రతుల డిజిటలైజేషన్..
వరంగల్‌లోని పోతన విజ్ఞాన పీఠం ఆవరణలో ప్రభు త్వం డిజిటల్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. బమ్మెర జీవిత విశేషాలను, సమగ్ర సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచింది. తాళప్రతులపై రాసిన సాహిత్యాన్ని ప్రస్తుత టెక్నాలజీతో డిజిటలైజేషన్ చేసింది. మ్యూజియంలోకి అడుగు పెట్టగానే చుట్టూ కనిపించే భారీ, చిన్న ఎల్ఈడీ స్క్రీన్లపై పోతన రచనలు దర్శనమిస్తాయి. సాహిత్య అంశాలపై చర్చలు నిర్వహించేందుకు ప్రత్యేక హాలును నిర్మించింది. మ్యూజియం ముందు భాగంలో నిర్మించిన కొలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
ఆలయాలన్నీ స్పెషల్ కారిడార్‌గా..
పోతన, సోమనాథుల రచనలను భావితరాలకు అందించేందుకు లైబ్రరీ, స్మృతి మందిరాల నిర్మాణం జరుగుతున్నది. పోతన సమాధి, ఆయన వ్యవసాయం క్షేత్రాన్ని, బావిని పురావస్తు శాఖ తీర్చిదిద్దుతున్నది. పాలకుర్తికి రూ.10.50 కోట్లు, బమ్మెరకు రూ.7.50 కోట్లు, వల్మిడికి రూ.5.50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పాలకుర్తి, వల్మిడి, బమ్మెరలోని దేవాలయాలన్ని స్పెషల్ కారిడార్‌గా అభివృద్ధి చేశారు.
-గోపాల్ పిన్నింటి