Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది. భూముల వ్యవహారంపై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ చర్యలపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు అమికస్ క్యూరీ సమయం కోరారు. దాంతో కేసు విచారణ ఆగస్టు 13వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.ఈ మేరకు విచారణను ఆగస్టు 13వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో విచారణ సందర్భంగా ప్రస్తుతం స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ మొత్తానికి ఫారెస్ట్‌ను సంరక్షించారు కదా? అంటూ ప్రశ్నించారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందన్నారు. స్థిరమైన అభివృద్ధి ముఖ్యమే అయినప్పటికీ.. బుల్డోజర్లతో అడవులను రాత్రికి రాత్రే నాశనం చేయవచ్చని అర్థం కాదని సీజేఐ అన్నారు.