ములుగు : ములుగు జిల్లాలో అటవీ సంపదను సంరక్షించాలి. అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పోడు రైతు అర్హులకు పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్వర చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్లో పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ అడవులు ఉన్న జిల్లా ములుగు అని తాడ్వాయి మండలం లింగాల, బందాల గ్రామాలలో పోడు భూముల సమస్య ఎక్కువ ఉన్నాయన్నారు.
పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారనికి క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ననుసరించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. విడుదల చేసిందని, ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అరుహులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, డీఎఫ్ఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు.