దండేపల్లి, ఆగస్టు 5 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీబీట్లో గిరిజనులు చెట్లపొదలు తొలిగించి మక్క పంట వేయగా, మంగళవారం అటవీ అధికారులు వచ్చి తొలగించారు. దీంతో అటవీశాఖాధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల తీరుపై అడవిబిడ్డలు ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్ఐ తహసినొద్దీన్ చేరుకుని గిరిజనులకు నచ్చజెప్పే యత్నం చేయగా వారు వినిపించుకోలేదు. జన్నారం డీఎఫ్వో రామ్మోహన్ చేరుకొని పోడుభూముల్లో మొక్కలు నాటవద్దని గిరిజనులకు సూచించి, అటవీ చట్టాల గురించి అవగాహన కల్పించారు. పోడు భూముల్లో మొక్కలు నాటినా, వన్యప్రాణులకు హాని కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పోడు భూముల్లో వేసిన పంటను నాశనం చేశారని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
ఫారెస్టు సిబ్బంది వేధిస్తున్నారని ఆత్మహత్యాయత్నం
ఖలీవాడి (మోపాల్), ఆగస్టు 5: అటవీ భూమిలో సాగుచేస్తున్నారని ఫారెస్టు అధికారులు పంటలను ధ్వంసం చేసేందుకు యత్నించడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం భైరాపూర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు రమావత్ ప్రకాశ్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రూ.1.20 లక్షలు పెట్టుబడిపెట్టి మూడు ఎకరాల్లో పంటవేశాడు. అది అటవీ భూమి అని ఫారెస్టు అధికారులు వేధిస్తున్నారని స్థానికులు తెలిపారు. మంగళవారం పంటలు ధ్వంసం చేసేందుకు గడ్డి మందుతో ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి రాగా ఆవేదనకు లోనైన ప్రకాశ్ అదే గడ్డిమందు తాగాడు. గమనించిన స్థానికులు నిజామాబాద్ జిల్లా దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.