Green India Challenge | పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ విద్యను తప్పని సరి చేసి బోధించాలని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ పాయెంగ్ అన్నారు. అసోం రాష్ట్రం తముల్ పూర్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే జోలెన్ దోయినరీ పౌరులతో కలిసి వందలాది మొక్కలు నాటారు.
ప్రకృతిని కాపాడడం, పర్యావరణ విద్యను తప్పనిసరిగా పాఠ్యాంశాల్లో చేర్చాలని.. ప్రకృతి విధ్వంసంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు, తద్వారా మానవాళికి పొంచి ఉన్న ముప్పు ఇంకా చాలామందికి అర్థం కావట్లేదని, ఆ దిశగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు మేల్కొనాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా బాగా పనిచేస్తుందని విస్తృతంగా మొక్కలు పెంపకం తద్వారా పర్యావరణ రక్షణకు అవసరమైన విషయాలను జాగృతం చేసే దిశగా జోగినపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని జాదవ్ కొనియాడారు. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, స్థానిక సంస్థలు, ఎన్జీవోల సహకారంతో 2030 కల్లా అసోంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. గత ఏడాది మొదలైన కార్యక్రమంలో ఇప్పటి వరకు 2.5 లక్షల మొక్కలు వివిధ ప్రాంతాల్లో నాటామని తెలిపారు. మజులీ ప్రాంతంలో జాదవ్ మొక్కలు నాటి అభివృద్ధి చేసిన మలైకోతాని తరహాలో మియావాకి విధానంలో చిక్కటి అడవుల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తామని సంతోష్ తెలిపారు.
పర్యావరణ మార్పులతో ఈశాన్య హిమాలయాలకు ముంపు పొంచి ఉందని, హిమానీ నదులు కరగటంతో రానున్న రోజుల్లో సముద్ర మట్టం పెరిగి తీర ప్రాంతాల ముంపు ప్రమాదం పొంచి ఉందని జాదవ్ అన్నారు. ఒకప్పుడు పర్యావరణం పరంగా మంచి సమతుల్యత ఉన్న అసోంలో క్రమంగా అటవీ విస్తీర్ణం ప్రమాదకర స్థాయిలో తగ్గుతోందని, అడవుల నరికివేతను అడ్డుకోవడంతో పాటు, ప్రకృతి పునరుద్ధరణలో విరివిగా మొక్కలు నాటాలని జాదవ్ అన్నారు. కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మద్దతును ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రకృతిని కాపాడేందుకు అస్సాం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, మహిళా సంఘాలకు రూ.10వేల ప్రోత్సాహం ఇస్తూ మొక్కలు నాటిస్తూ, వాటి పెంపకం బాధ్యత అప్పగించామని ఎమ్మెల్యే జోలెన్ దోయినరీ తెలిపారు. కార్యక్రమంలో తముల్పూర్ కలెక్టర్ బీ బికాస్ భగవత్, ఇగ్నైటింగ్ మైండ్స్ నుంచి రీతురాజ్ పుకాన్, నవోదయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ పాల్గొన్నారు.