హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం విజయవంతం చేసినట్టుగానే రాష్ట్రంలో ఎకో టూరిజం, రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టగానే హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రతి ఒకరూ ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో అటవీ ప్రాంతాల పునరుద్ధరణ జరగాలని కోరారు. అటవీ ప్రాంతాల రక్షణ, టైగర్ రిజర్వుల సమర్థ నిర్వహణ, ఎకో టూరిజం అభివృద్ధిపై జిల్లాల అటవీ అధికారుల ఒకరోజు వర్‌షాప్ శనివారం అరణ్యభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీ పునరుద్ధరణలో గజ్వేల్ ఆదర్శంగా నిలిచిందని, ఇదే స్ఫూర్తితో టైగర్ రిజర్వుల నిర్వహణలో అమ్రాబాద్, కవ్వాల్ పేరు చెప్పేలా పోటీ పడి పనిచేయాలని చెప్పారు.