హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీడీలు చుట్టేందుకు వినియోగించే తునికాకు సేకరణ పథకం కింద 30 జిల్లాలు, 37 డివిజన్లలో లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఏజెన్సీగా రూ.59.79 కోట్ల విలువైన 243 బీఎల్ యూనిట్లు (2,41,700 స్టాండర్డ్ బ్యాగ్స్ -ఎస్బీ) బీడీ ఆకును సేకరించాలని అటవీశాఖ లక్ష్యంగా ప్రతిపాదించింది. ఇందుకు అవసరమయ్యే నిధులను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ సమకూరుస్తుంది. సేకరణ విధివిధానాలపై మార్గదర్శకాలను వెల్లడిస్తూ అటవీశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఏ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.