హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, సంఘాలు వద్దని ఎంత వారించినా..ప్రభుత్వం వీటిని లెక్కచేయకుండా బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన పదెకరాలను ఫైన్ఆర్ట్స్ వర్సిటీకి కేటాయించింది. అది అత్యం త గోప్యంగా.. రహస్యంగా. జూబ్లీహిల్స్‌లోని బీఆర్ఏఓయూకు చెందిన పదెకరాల స్థలాన్ని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కేటాయించింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం రెండు వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖ రాశారు. వర్సిటీకి స్థల కేటాయింపు విషయాన్ని ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనలను బీఆర్ అంబేద్కర్ వర్సిటీ ఉద్యో గ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి, నిరసన ప్రదర్శనలు సైతం నిర్వహించాయి. ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. కానీ వాటిని లెక్కచేయకుండా సర్కారు మంగళవారం స్థలాన్ని కేటాయిస్తున్నట్టు రెండు వర్సిటీలకు లేఖ రాసింది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, టీచర్లు, సిబ్బందిని సమీకరించి జేఏసీగా ఏర్పడి త్వరలోనే ఆందోళనను తీవ్రతరం చేస్తామని బీఆర్ఏఓయూ ఉద్యోగులు హెచ్చరించారు. ఒక్క ఇంచు స్థలాన్ని కూడా వదులుకోబోమని స్పష్టంచేశారు.