హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : సోషల్ వెల్ఫేర్, మైనార్టీ, బీసీ, ఎస్టీ తదితర గురుకులాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆహార కలుషిత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూ దవాఖానల పాలవుతున్నారు. పలు చోట్ల ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒకే గురుకులంలో పదే పదే ఫుడ్పాయిజన్ కేసులు నమోదవుతుండటం సర్కారు వైఫ్యలానికి అద్దంపడుతున్నది. గురుకులాలకు ఆహార పదార్థాలు, కిరాణా సామగ్రి, పండ్లు, కూరగాయాలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల కోసం గతంలో ఎప్పుడూ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేవారు. మార్చి, ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేవారు. ఫలితంగా విద్యాసంవత్సరం ఆరంభం నాటికి కొత్త కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండేవారు.
కానీ ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. పాత కాంట్రాక్టర్లే ఆ సెక్యూరిటీ డిపాజిట్లను గత మేలో చెల్లింపులు చేశారు. అనధికారికంగా కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా ఆహారపదార్థాల సరఫరాదారులు అరకొరగా, నాణ్యతలేని సరుకులు సరఫరా చేస్తున్నారు. ఫలితంగానే ఎక్కువగా ఫుడ్పాయిజన్ కేసులు నమోదవుతున్నాయి. క్యాటరింగ్ సేవలు నిర్వహించిన కాంట్రాక్టర్లకు సైతం ప్రభుత్వం దాదాపు 8 నెలల బిల్లులను విడుదల చేయలేదు. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొర సిబ్బందితో కాలం వెల్లదీస్తున్నారు. సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగి వంటపాత్రలను శుభ్రంగా కడగకపోవడం, వంటను మమ అనిపించడంతో అంతిమంగా ఫుడ్ పాయిజన్ ఘటనలకు దారితీస్తున్నది. ఈ ఏడాది ఇప్పటికీ స్వీపింగ్ సిబ్బందిని నియమించలేదు. దీం తో గురుకులాల్లో ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. నీటి ట్యాంకులను కూడా శుభ్రం చేయకపోవడంతో నీరు కలుషితమై ఎక్కువగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.