పాలకుర్తి, జూన్12: వారిద్దరూ మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులు. ఒకరు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన డీసీసీ ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య.. మరొకరు పెద్దపల్లి డీసీసీ సంయుక్త కార్యదర్శి గౌసియాబేగం. ఇందులో సమ్మయ్య అనుచరులు సూర సంతోష్, ఓల్లెపు రమేశ్.. గౌసియాబేగం సోదరుడు ఆరిఫ్ పాషాపై దాడి చేశారు. ఈ గొడవ బసంత్‌నగర్ ఠాణాకు చేరింది. బుధవారం రాత్రి బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ వద్ద గౌసియాబేగం మాట్లాడుతూ.. సూర సమ్మయ్య కాంగ్రెస్‌లో ఉంటూనే.. పార్టీ శ్రేణులపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. డబ్బు, అధికార బలంతో చిన్నస్థాయి నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
బయ్యపు మనోహర్‌రెడ్డికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నావంటూ.. బుధవారం ఉదయం బసంత్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద హోటల్లో తన సోదరుడు ఆరిఫ్ పాషాపై సూర సంతోష్, ఓల్లెపు రమేశ్ కత్తులతో దాడి చేశారని తెలిపారు. రెండు వర్గాల నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు అనుచరులే కావడంతో పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది మైనార్టీలు, వారి అనుచరులు పోలీస్టేషన్ ఎదుట రాస్తారోకోకు యత్నించారు. ఆరిఫ్ పాషా ఠాణాలో ఫిర్యా దు చేయగా.. జీడీనగర్‌కు చెందిన సూర సంతోష్, ఓల్లెపు రమేశ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై స్వామి తెలిపారు. ఆరిఫ్ పాషాపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధ లేదని సమ్మయ్య తెలిపారు.