CPI Narayana | జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా రూపొందించడం అభినందనీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకుండా.. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర గీతం కంపోజ్ చేయానికి కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్‌గా పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవని.. హద్దులు గీయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ధ్యానం చేయడమంటే కన్యాకుమారిని కలుషితం చేయడమే అని విమర్శించారు.
ఏపీ పాలిటిక్స్‌పై కూడా సీపీఐ నారాయణ స్పందించారు. ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు లేవని జోస్యం చెప్పారు. కావాలనే విశాఖలో ప్రమాణస్వీకారం అంటూ వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారని అన్నారు. కౌంటింగ్ గురించి కూడా వైసీపీ నేతలు రెచ్చగట్టే మాటలు మాట్లాడుతున్నారని.. దాన్ని బట్టే వైసీపీ ఓడిపోతుందని తెలుస్తోందని తెలిపారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు ఇండియా కూటమితో జత కట్టాలని కోరుకుంటున్నా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.