అయిజ/శ్రీశైలం/మహదేవపూర్/కన్నాయిగూడెం, జూలై 12 : జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శనివారం జూరాలకు 1.08 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా మొత్తం అవుట్‌ఫ్లో 1,04,186 క్యూసెక్కులు నమోదైంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.222 టీఎంసీల నిల్వ ఉన్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతుండటంతో 9 క్రస్ట్ గేట్లు ద్వారా 29,711 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదిలోకి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. మూడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 27,157 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జలాశయానికి శనివారం సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో 1,53,120 క్యూసెక్కులు నమోదైంది. కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 68,377 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.00 అడుగులు, పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.3520 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది, గోదావరి నదుల ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శనివారం వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం సుమా రు 6.5 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుండగా, మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్ ఇన్‌ఫ్లో 4,99,840 క్యూసెక్కులుగా ప్రవహిస్తున్నది.