గద్వాల/అయిజ/శ్రీశైలం : కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 1,57,729 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 1,65,102 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులకుగానూ ప్రస్తుతం 1697.24 అడుగులకు చేరగా.. సామర్థ్యం 129.72 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 91.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,65,000 క్యూసెక్కులు ఉండగా.. 26 గేట్లు తెరవగా.. అవుట్‌ఫ్లో 1,66,900 క్యూసెక్కులు ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1615 అడుగులకుగానూ 1609.97 అడుగులు నిల్వ ఉండగా.. సామర్థ్యం 37.640 టీఎంసీలకుగానూ 26.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
అలాగే టీబీ డ్యాంకు వరద పరవళ్లు తొక్కుతున్నది. ఇన్‌ఫ్లో 88,270 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,078 క్యూసెక్కులుగా నమోదు కాగా పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ 62.060 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులు ఉండగా.. 1620.26 అడుగులకు చేరినట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. కర్ణాటకలోని ఆర్డీఎస్కు వరద రాక మొదలైంది. శుక్రవారం ఆనకట్టకు 1,527 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 834 క్యూసెక్కులు కన్స్ట్రక్షన్ స్లూయిస్ ద్వారా సుంకేసుల బ్యారేజీకి విడుదల చేసినట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు.
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో జూరాలకు వరద నమోదవుతున్నది. శుక్రవారం ఉదయం 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 3 గేట్ల నుంచి.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇన్‌ఫ్లో 37,951 చేరుకోగా 7 గేట్ల ద్వారా, సాయంత్రం 6 గంటల తర్వాత 22 గేట్లను తెరచి దిగువకు 1,22,262 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.569 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి 37,252 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 10,831 క్యూసెక్కులు వచ్చి చేరింది. నీటినిల్వ 885 అడుగులకుగానూ ప్రస్తుతం 825.90 అడుగులకు చేరగా.. పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 45.53 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.