హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సౌర విద్యుత్ రంగంలో సింగరేణి కొత్త మైలురాయిని దాటనున్నది. మంచిర్యాల సమీపంలోని ఎస్టీపీపీ ప్రాంగణంలో తొలిసారిగా ఫ్లోటింగ్ ప్లాం ట్ను ప్రారంభించనున్నది. ఈనెల 15న 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. శుక్రవారం సింగరేణి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
సింగరేణి పరిధిలో గత రెండేండ్లలో 8 ప్రాంతాల్లో 219 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మూడో దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో భాగంగా ఎస్టీపీపీ కేంద్రంలోని 3 టీఎంసీల రిజర్వాయర్లో నీటిపై 15 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు.
ఇందులో మొదటి 5 మెగావాట్ల ప్లాంట్ను సంక్రాంతిరోజు ప్రారంభించనున్నారు. ఇదే రిజర్వాయర్లో నిర్మాణంలో ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్ పనులు కూడా పూర్తిచేసి, మార్చి నాటికి ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సత్యనారాయణ, జీఎం సురేశ్, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఎస్కే సుర్, జేఎన్ సింగ్, జీఎంలు, ఏజీఎం పాల్గొన్నారు.