హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల సాధనే ధ్యేయంగా చేపట్టిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని 6 నుంచి 8 తరగతులకు కూడా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తున్నది. ఇటీవలే ఇదే అంశంపై సమగ్రశిక్ష, ఎస్సీఈఆర్టీ అధికారులతో చర్చించి, పై తరగతుల్లోనూ అమలుచేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికొచ్చారు. ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు తొలిమెట్టు పేరుతో ఎఫ్ఎల్ఎన్ను నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో 6,7,8 తరగతుల్లోనూ అమలుచేసే అంశంపై కసరత్తు చేస్తున్నారు.
1 నుంచి 5 తరగతులకు మూడో విడత
రాష్ట్రంలోని ప్రాథమిక తరగతుల విద్యార్థులకు అమలుచేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం రెండు విడతలను విజయవంతంగా పూర్తిచేసుకొన్నది. ఈ నెల 17 నుంచి మూడో విడత తొలిమెట్టును ప్రారంభించారు. ఇది 2023 జనవరి 12 వరకు కొనసాగుతుంది. మూడో విడత నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఇటీవలే మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇందులో బహుళతరగతి బోధన, బోధన సమయం, ప్రాక్టీస్ సమయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు.