కరీంనగర్ : రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అని వ్యాఖ్యానించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర నిరసనలకు దారి తీస్తున్నది. దీనిపై కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామ రైతులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ గ్రామంలో ప్రవేశం లేదని పెద్ద ప్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. కరీంనగర్, సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఈ ప్లెక్సీ అందరిని ఆలోచింప జేస్తున్నది.
కాగా, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడి అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, పలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజులు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.