Selfie | గజ్వేల్, జనవరి 11 : సరదాగా గడిపేందుకు స్నేహితులు చేసిన విహారయాత్ర విషాదాంతమై అంతిమయాత్రగా మారింది. జీవితంలో తీపిగుర్తుగా ఉండాలని తీసుకున్న సెల్ఫీ వారి చివరి జ్ఞాపకంగా మిలిగిపోయింది. సరదా కోసం జలాశయంలో మునిగినవారు తమ కుటుంబాలను తీవ్ర శోకసంద్రంలో ముంచేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్‌లో గల్లంతై ఐదుగురు యువకులు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. జీవితంలో స్థిరపడి తమ బాగోగులు చూసుకుంటారని కలలు గన్న తల్లిదండ్రులు కన్నబిడ్డలు విగతజీవులవడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. వారి రోదనలు చూసి అందరి కళ్లు చెమర్చాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు స్నేహితులు శనివారం సెలవు రోజు కావడంలో సరదాగా గడిపేందుకు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లారు. తెల్లవారుజామునే తమతమ ఇండ్ల నుంచి బయలుదేరిన వేర్వేరుగా ద్విచక్రవాహనాలపై బయలుదేరినవారంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఒకేచోట కలుసుకున్నారు.
స్కూటీలపై వెళ్తూ సరదాగా సెల్ఫీలు, వీడియాలు తీసుకుంటూ ఆహ్లాదంగా ప్రాజెక్టుకు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. కొండపోచమ్మ జలాలు, అక్కడి అందాలను చూసినవారంతా ముసిరిపోయారు. నీళ్లలో దిగి సరదాగా ఫొటోలకు పోజులిచ్చారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుతూ జలకాలాటలు ఆడారు. ఈ క్రమంలోనే మరింత లోతుల్లోకి అనుకోకుండా వెళ్లిన ఏడుగురు గల్లంతయ్యారు. నీళ్లలో మునిగి వారిలో ఆచూకీ లభించకపోగా.. మరో ఇద్దరు అతికష్టంపై సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం తమ స్నేహితులు గల్లంతైన విషయాన్ని వారు 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత శనివారం రాత్రి ఐదుగురి మృతదేహాలు లభించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరిలో ముషీరాబాద్‌లోని ఇందిరానగర్‌కు చెందిన అన్నదమ్ములు గ్యార ధనుశ్(20), గ్యార లోహిత్(17), బన్సీలాల్‌పేటకు చెందిన చీకట్ల దినేశ్వర్(17), అత్తాపూర్‌కు చెందిన సాహిల్ దీపక్ సుతార్(19), ఖైరతాబాద్‌లోని చింతలబస్తీకి చెందిన ఉప్పల జతిన్(17) మృతిచెందడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాంనగర్‌కు చెందిన మిర్గనిక్ అలియాస్ మృగాంక్, ముషీరాబాద్‌కు చెందిన ఇబ్రహీం సురక్షితంగా బయటపడ్డారు.
మృతులందరిదీ పేద, మధ్యతరగతి కుటుంబాలే కావడంతో బస్తీలు, కాలనీల్లో రోదనలు మిన్నంటాయి. ఇందిరానగర్‌కు చెందిన సోదరులు ధనుశ్, లోహిత్‌ల తండ్రి నర్సింగరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్ద కుమారుడు ధనుశ్ తండ్రికి సాయంగా ఉండేవాడు. చిన్న కుమారుడు లోహిత్ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. చీకట్ల దినేశ్వర్ డిప్ల్లొమా రెండో సంవత్సరం చదువుతుండగా, అతడి తండ్రి కిషన్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాహిల్ దీపక్ సుతార్ తల్లి అనిత వంట పని చేసుకుంటూ కుమారుడిని చదివిస్తున్నారు. సాహిల్ దీపక్ చదువుకుంటూనే ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. జతిన్ డిగ్రీ చదువుతుండగా, అతడి తండ్రి కోటేశ్వర్ ఆటో నడుపుతూ కుమారుడిని చదివిస్తున్నారు. కొండపోచమ్మ సాగర్‌లో పడి ప్రమాదవశాత్తు తమ పిల్లలు మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్నేహితులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు.
కొండపోచమ్మ సాగర్‌లో హైదరాబాద్‌కు చెందిన యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లాలోని ములుగు, మర్కూక్, గౌరారం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గత ఈతగాళ్ల సాయంతో శనివారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 7 గంటల సమయంలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల నుంచి గజ ఈతగాళ్లను రప్పించగా.. మృతదేహాల గాలింపు చర్యలను సిద్దిపేట సీపీ అనురాధ పర్యవేక్షించారు. ఏసీపీలు పురుషోత్తంరెడ్డి, మధు, సీఐలు మహేందర్, లతీఫ్, సైదా, డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సైతం చెమటోడ్చారు. గాలింపు చర్యల్లో గత ఈతగాళ్లుతో పాటు ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ములుగు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. గజ్వేల్ దవాఖాన వద్ద మృతుల కుటుంబ సభ్యులను ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పరామర్శించారు. ప్రాజెక్టు వద్ద మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, నాయకులు ఎలక్షన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు మునిగి ఐదుగురు యువకులు మరణించడం బాధకారమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందడం వారి కుటుంబానికి తీరని లోటని విచారణ వ్యక్తం చేశారు. తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండపోచమ్మ సాగర్ దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): కొండపోచమ్మ సాగర్ జలాశయంలో దురదృష్టవశాత్తు నీట మునిగి ఐదుగురు యువకులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు ఈత రాకపోవడం వల్ల నిండుగా ఉన్న జలాశయంలో మునిగి ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. మరణించిన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.