పల్నాడు: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గురజాల (Gurajala) ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. బాధితులంతా తెలంగాణలోని నల్లగొండ (Nalgonda) జిల్లా దామెరచెర్ల (Dameracharla) మండలం నర్సాపురం వాసులుగా గుర్తించారు. వారంతా గురజాల మండలం పులిపాడుకు కూలీ నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.