హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉప్పల్లో పూజారి, అతడి కుమారుడు హత్యకు గురైన ఘటనకు మూఢనమ్మకాలే కారణమని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వివరాల ప్రకారం.. ఉప్పల్లో నివాసముండే పూజారి నర్సింహుల నర్సింహ (75) వద్దకు ఫైనాన్స్ వ్యాపారి వినయ్ యోగేందర్రెడ్డి తరచూ వెళ్లేవాడు. గతంలో ఎస్సై ఉద్యోగం కోసం రూ.6లక్షలు ఇచ్చి నర్సింహతో పూజలు చేయించినా ఫలితం లేకపోయింది. 2019లో మరోసారి నర్సింహతో పూజలు చేయించిన వినయ్.. ఆయన సూచన మేరకు ఆస్ట్రేలియా వెళ్లాడు. కొద్దిరోజులకే లాక్డౌన్తో 2020 సెప్టెంబర్లో తిరిగి వచ్చేశాడు. పూజ చేసినా ఉద్యోగం రాలేదనే కోపంలో ఉన్న వినయ్.. గతంలో ఎస్సై ఉద్యోగం కోసం ఇచ్చిన రూ. 6 లక్షలు తిరిగి ఇవ్వాలంటూ నర్సింహపై ఒత్తిడి తెచ్చాడు. తర్వాత వినయ్ అనారోగ్యం, ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి పెరిగిపోయాయి. నర్సింహ చేతబడి చేయడం వల్లే ఇలా జరుగుతున్నదని అనుమానించిన వినయ్.. పూజారిని చంపాలని ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు, మరికొందరు కలిసి ఈ నెల 14 ఉదయం నర్సింహ ఇంటి తలుపులు తెరవగానే వినయ్, బాలకృష్ణ లోపలికి వెళ్లి అతడిని హత్య చేశారు. అరుపులు విని కొడుకు శ్రీనివాస్ కిందకు రావడంతో అతడినీ నరికి చంపారు.