గొల్లపల్లి/ నారాయణఖేడ్, డిసెంబర్ 28: వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్‌కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్నా మల్లేశ్ (24), జిన్నా మహేశ్ (23) ముగ్గురూ కలిసి శనివారం రాత్రి నారాయణఖేడ్ నుంచి బైక్‌పై నర్సాపూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో జూకల్ శివారులోని డబుల్బెడ్రూమ్ ఇండ్ల సముదాయం సమీపంలో కల్వర్టు నిర్మాణం కోసం తవ్విన గుంతలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. నారాయణఖేడ్‌కు బయలుదేరిన వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆదివారం వారి ఆచూకీ తెలుసుకునేందుకు నారాయణఖేడ్‌కు వస్తుండగా, కల్వర్టు గుంతలో విగతజీవులై పడి ఉండటం గమనించారు.
పోలీసులు మృతదేహాలను నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించి దర్యాప్తు చేపట్టారు. మల్లేశ్, మహేశ్ అన్నదమ్ములు కాగా, వీరికి నర్సింహులు బావ అవుతాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి శివారులోని క్రషర్ వద్ద ఆదివారం తెల్లవారు జాము న జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరు దుర్మరణం చెందారు. పో లీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి మం డలం అబ్బాపూర్‌కు చెంది న దంపతులు రెడపాక లింగయ్య(55)- లచ్చవ్వ (48) హైదరాబాద్‌లో ఉండే లింగయ్య బావమరిది వద్దకు వెళ్లడానికి తెల్లవారుజామునే బైక్‌పై అబ్బాపూర్ నుంచి జగిత్యాలకు బయలుదేరారు. గొల్లపల్లి శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో లచ్చవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన లింగయ్యను జగిత్యాలలోని దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.