CEC | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలను సీఈసీ ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటుంది. పూర్తి స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా? లేదా? అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు ఐదు రకాల పరిశీలకులను (అబ్జర్వర్లు) పంపిస్తుంది. వీరి ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు, సంఘటనలను తెలుసుకుంటూ తగిన చర్యలు తీసుకుని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటుంది. సాధారణంగా జిల్లాకు ఒకరి చొప్పున ఐదు రకాల అబ్జర్వర్లు.. అంటే ఐదుగురు సీనియర్ అధికారులను నియమిస్తుంటారు. వీరందరూ సాధారణంగా ఎన్నికలు జరిగే రాష్ర్టానికి చెందనివారే (ఇతర రాష్ర్టాలకు చెందినవారు) అయి ఉంటారు.
ఐదు రకాల అబ్జర్వర్లు
జనరల్ అబ్జర్వర్
జనరల్ అబ్జర్వర్‌గా ఐఏఎస్ అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతుంది? ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సాగుతున్నాయా? లేదా? అనేది క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు.
పోలీసు అబ్జర్వర్
పోలీసు అబ్జర్వర్‌గా ఐపీఎస్ అధికారులను నియమిస్తూ ఉంటారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలతోపాటు ఎన్నికలు జరిగే జిల్లా/నియోజకవర్గస్థాయిలో శాంతి భద్రతలు, సరిపడా భద్రతా బలగాలను నియమించారా? అనే ది ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. సివిల్, పోలీసు యంత్రాంగాల మధ్య సమన్వయం ఎలా ఉందనేది గమనిస్తూ.. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు దోహదపడతారు.
కౌంటింగ్ అబ్జర్వర్లు
సాధారణ, పోలీసు అబ్జర్వర్లతోపాటు కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా? లేదా?.. ఏదైనా నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తున్నారా? లేదా? అనేది పరిశీలించడానికి కౌంటింగ్ అబ్జర్వర్లను జిల్లా/నియోజకవర్గస్థాయిల్లో నియమిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఈవీఎంలతోపాటు మొత్తం కౌంటింగ్ ప్రక్రియను మొత్తం వీరు పరిశీలిస్తారు.
స్పెషల్ అబ్జర్వర్లు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలమేరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక పరిశీలకులను నియమిస్తుంది. సాధారణంగా ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్‌లోని ఉన్నతాధికారులనే స్పెషల్ అబ్జర్వర్లుగా నియమిస్తారు.
ఎక్స్పెండిచర్ అబ్జర్వర్
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ప్రతి ఖర్చును పరిశీలించేందుకుగాను ఎన్నికల కమిషన్ ఈ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లను నియమిస్తుంది. ఎన్నికల ప్రచారానికి ఖర్చు, అభ్యర్థులు పెట్టే ఖర్చులాంటి అన్ని రకాల ఖర్చులను వీరు పరిశీలిస్తారు.