Telangana | హైదరాబాద్, మే 23(నమస్తే తెలంగాణ):మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు కచ్చితంగా ఒక పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదవులన్నీ మాలలకే ఇస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఐదుగురు మాదిగ ఎమ్మెల్యేలు (ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేలు, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంతరావు, కవ్వంపల్లి సత్యనారాయణ) కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.
మంత్రివర్గ విస్తరణలో తమ ఐదుగురిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా సమ్మతమేనని స్పష్టంచేశారు. కానీ, ఎవరికో ఒకరికి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తాము తొలినుంచీ కాంగ్రెస్‌కు విధేయులుగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. తామే ఒరిజినల్ పార్టీ మాదిగ ఎమ్మెల్యేలమని పేర్కొన్నారు. చేవెళ్ల డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణ హామీలను అమలుచేయాలని కోరారు. ఇప్పటికే మార్చి 25న ఈ ఎమ్మెల్యేలే మంత్రి పదవి కోసం లేఖ రాశారు. ఇప్పుడు అదే అంశంపై మరోసారి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుత ప్రభుత్వంలో పదవులన్నీ మాల వర్గానికి చెందిన నేతలకు ఇస్తున్నారని మాదిగ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మూడు ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ సీట్లలో రెండు మాల వర్గానికి ఇవ్వగా, ఒకటి మాత్రమే మాదిగలకు ఇచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటును కూడా మాల వర్గానికి చెందిన నేతకే (అద్దంకి దయాకర్) ఇచ్చారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి కూడా మాల సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చారని వివరించారు. ఇక మాదిగల్లో 1% ఉండే ఉప కులానికి ఒకే ఒక్క మంత్రి పదవి ఇచ్చారని, 9% జనాభా కలిగిన మాదిగలకు మాత్రం మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు.
రాష్ట్ర క్యాబినెట్లో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉన్నది. గత నెలలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి. అప్పట్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఏం జరిగిందో ఏమో కానీ ఆ కసరత్తు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తున్నవారు లేఖల యుద్ధానికి తెరతీశారు. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మాదిగ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖ రాయడం సంచలనం సృష్టించింది.
మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత లంబాడ, ఆదివాసీ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు సైతం తమ జిల్లాకు ప్రాతినిథ్యం ఇవ్వాలంటూ మరో లేఖ రాశారు. ఈ లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా సంతకం పెట్టడం గమనార్హం. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం ఇవ్వాలంటూ లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది.
నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకే జానారెడ్డి ఈ చర్చ లేవదీశారనే ప్రచారం జరిగింది. దీంతో జానారెడ్డి శకుని మాదిరిలా తయారయ్యారంటూ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో మంత్రి విస్తరణ ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మాదిగ ఎమ్మెల్యేలు మరో లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది.