Road Accident | మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తా హౌస్ బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొండ సమీపంలో స్పోర్ట్స్ బైక్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు, కారులోని ముగ్గురు దుర్మరణం చెందారు.
ఓ కుటుంబం వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో మృతిచెందిన వారిని గౌసియా (30), అమీర్ (18 నెలలు), ఉజెఫా(8) గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.
స్పోర్ట్స్ బైక్ అతివేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బైక్ 100కిలోమీటర్లకు పైగా వేగంతోనే వచ్చి కారును ఢీకొట్టిందని పేర్కొంటున్నారు. కాగా, పాలమూరు బైపాస్ రోడ్డు రాత్రివేళలో బైక్ రేసింగ్‌లకు అడ్డాగా మారిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. “ప్రతి రోజు రాత్రి స్పోర్ట్స్ బైక్‌లతో యువకులు బైపాస్‌పై రేసింగ్‌లు చేస్తుంటారు. చెవులు పగిలేలా శబ్దాలు చేస్తూ ప్రాణాలతో ఆటలాడుతుంటారు. పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాత్రివేళల్లో ప్రత్యేక పెట్రోలింగ్, స్పీడ్ గన్స్, నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి బైక్ రేసింగ్‌లను పూర్తిగా అరికట్టాలని కోరుతున్నారు. లేదంటే మరిన్ని అమాయక కుటుంబాలు రోడ్లపై బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.