హైదరాబాద్, జూన్ 13(నమస్తేతెలంగాణ): హైదరాబాద్ లాలాగూడలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ డెయిరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. డెయిరీలో బాదంపాలు తయారుచేసే స్టెయిలైజర్ యంత్రం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో అక్కడే పనిచేస్తున్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. వారిలో నలుగురిని గాంధీ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మరో కార్మికుడు రవికి తీవ్రగాయాలు కావడంతో డీఆర్డీఏ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు విజయడెయిరీ జనరల్ మేనేజర్ మల్లికార్జున్ తెలిపారు.
స్టెయిలైజర్ యంత్రంలో 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద బాదంపాలు వేడిచేయగా ఒక్కసారిగా పేలుడు సంభవించి, అక్కడే ఉన్న కార్మికుడు రవిపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయని, సమీపంలో ఉన్న మరో నలుగురికి ఆవిరి వ్యాప్తించి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇతర కార్మికులందరూ భోజనానికి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కార్మికులు తెలిపారు.