Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్దలో పొలాలకు బాట విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
గద్వాల, అక్టోబర్ 6: పొలాలకు వెళ్లేందుకు బాట విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం అరగిద్ద గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక వివరాల ప్రకారం.. తమ పొలాలకు వెళ్లేందుకు బాట కల్పించాలంటూ ఓ వర్గానికి చెందిన రైతులు మరో వర్గాన్ని కోరుతున్నారు. ఈ అంశంపై కొంతకాలంగా ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రవి, నవీన్, పెద్ద తిమ్మప్ప, తిమ్మప్ప, కుంటన్న గాయపడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. భూ వివాదానికి సంబంధించిన పత్రాలు, బాట విషయంలో ఇరువర్గాల మధ్య ఉన్న వివాదం తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. పోలీసుల విచారణలో పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.