హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల మూసివేత పరంపర కొనసాగుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరంలో మరో ఐదు కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ)గుర్తింపునకు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ఈ కాలేజీలు క్లోజ్ అయినట్టే. వీటిలో ఎంఎన్ఎఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సెయింట్ మేరీ ఇంజినీరింగ్ కాలేజ్, స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ వుమెన్, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఉన్నాయి.
దీంతో వీటిల్లోని సీట్లన్నీ రద్దయ్యాయి. సర్కారు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కాలేజీలు సతమతమవుతున్నాయి. కాలేజీలను నడిపే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యాలు కాలేజీలను క్రమంగా మూసేసుకుంటున్నాయి. మరికొన్ని యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ జంజా టం లేకుండా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల బాటపడుతున్నాయి. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. రిజర్వేషన్లు ఉండవు. ఈ విద్యాసంస్థల్లో చేరిన వారే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు పెరుగుతాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకు దూరమవుతారని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.