TG Weather | తెలంగాణలో పలుచోట్ల ఇటీవల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జనజీవనం స్తంభిస్తున్నది. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి శనివారం వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశగా వంగి ఉందని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్ నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.. శుక్రవారం నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 6.4, నేరడిగొండలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ చెప్పింది.