మంచిర్యాల, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లిలో ఆరుగురి సజీవ దహనం కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే ఈ హత్యలు చేసినట్టు విచారణలో తేలిందని రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
మంగళవారం ఆయన మంచిర్యాలలో మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. తనను వదిలిపెట్టి మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త శాంతయ్య ను, అతనితో ఉంటున్న మహిళ పద్మ, ఆమె భర్త శివయ్యను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో శాంతయ్య భార్య సృజన ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇందుకు ఆమె తన ప్రియుడు లక్ష్మణ్‌తో కలిసి పథకం రచించింది.
లక్షెట్టిపేటకు చెందిన రమేశ్‌కు సుపారీ ఇచ్చారు. గతం లో మూడుసార్లు శాంతయ్యపై హత్యాయత్నం చేసి విఫలమయ్యారు. రాఖీ సినిమాలో హీరో పెట్రోల్ పోసి విలన్లను చంపినట్టు చేస్తే తాము సులభంగా తప్పించుకోవచ్చని భావించారు. ఇందుకోసం గుడిపెల్లి గ్రామానికి చెంది న సమ్మయ్యకు రూ.1.50 లక్ష లు ఆశ చూపించి పద్మ, శాంతయ్యల సమాచారం సేకరించారు. ఈనెల 16న అర్ధరాత్రి ఆ ఇంట్లో శాంతయ్య, పద్మ, ఆమె భర్త శివయ్య మాత్రమే ఉన్నారనుకొని తలుపు పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇందుకోసం రూ. 5 వేల విలువైన పెట్రోల్‌ను నాలుగు క్యాన్లలో తీసుకొచ్చారు.
ఆ సమయంలో పద్మ దగ్గరి బంధువు మౌనికతోపాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా అదే ఇంట్లో ఉన్న విషయం నిందితులకు తెలియదని విచారణలో తేలినట్టు సీపీ తెలిపారు. ఈ కేసుతో సం బంధం ఉన్న మేడి లక్ష్మణ్, సృజన, శ్రీరాముల రమేశ్, వేల్పుల సమ్మయ్య, ఆర్నకొండ అంజయ్యను అరెస్ట్ చేశామన్నారు. సృజన, లక్ష్మణ్ పక్కా ప్రణాళికతో నాలుగు నెలల నుంచి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకున్నారని, నేరుగా కలుసుకొని ఈ హత్యకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకునేవారని తెలిసింది.