ఖమ్మం రూరల్, మార్చి 8: పథకం ప్రకారం ఓ వ్యక్తికి బీమా చేయించి హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించిన నిందితులు పోలీసులకు పట్టుబడిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకున్నది. ఆదివారం ఖమ్మం రూరల్ సీఐ ముష్కారాజ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఖమ్మంకు చెందిన దేశబోయిన శ్రీనివాస్‌కు నగరానికి చెందిన చాగంటి రవి (55) వరుసకు బావమరిది అవుతాడు.
ఇటీవల చాగంటి రవి పేరుమీద శ్రీనివాస్ రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించాడు. బీమా డబ్బుల కోసం అతడిని చంపేందుకు పథకం వేశాడు. ఈ నెల 2న రాత్రి 8 గంటలకు చాగంటి రవిని కలిసి ఖమ్మం రూరల్ మండలం ఎంవెంకటాయపాలెం శివారుకు ఆటోలో తీసుకెళ్లాడు. రవికి మద్యం తాగించిన తరువాత అక్కడే వదిలేసి శ్రీనివాస్ వెళ్లిపోయాడు. రవి.. అక్కడి నుంచి ఎంవెంకటాయపాలెం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ప్లాన్‌లో భాగంగా శ్రీనివాస్ పురమాయించుకున్న చిలుక్కోయలపాడుకు చెందిన జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేశ్ మహీంద్రా కారుతో రవిని ఢీకొట్టి హత్య చేశారు. నిందితులు తనగంపాడులోని జోగి వెంకటేశ్ మిత్రుడైన దించినాల సురేశ్ ఇంటికి వెళ్లారు. కారుకు యాక్సిడెంట్ అయిందని, తరువాత వచ్చి కారును తీసుకెళ్తామని సురేశ్‌కు చెప్పి ఆటోలో వెళ్లిపోయారు. పోలీసుల దర్యాప్తులో రవిది హత్యగా తేలడంతో .. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో హతుడు రవి భార్య ప్రశాంతి ఉండటం గమనార్హం.